నిర్మల్, వెలుగు: పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటకరంగ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి అవసరమైన సౌకర్యాలు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రస్థాయి హిస్టారికల్, టూరిజం అధికారుల సమన్వయంతో ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రాజెక్టులు, జలపాతాలను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. అడెల్లి పోచమ్మ, సదర్ మాట్ బ్యారేజ్, స్వర్ణ, కడెం, గడ్డెన్న వాగు ప్రాజెక్టులను సందర్శించే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లా స్థాయి టూరిజం కమిటీని ఏర్పాటు చేసి, పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పర్యాటక ప్రదేశాలపై ఫొటో, డాక్యుమెంటరీ పోటీలు నిర్వహించాలని.. మేధావులు, విద్యావంతులు, ప్రముఖులతో సంప్రదించి పర్యాటకారంగం అభివృద్ధికి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
అనంతరం బాసర సరస్వతి ఆలయ అభివృద్ధిపై చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాసర దేవాలయంలో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యం మెరుగ్గా ఉండాలన్నారు. ప్రత్యేక రోజుల్లో రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, పర్యాటక శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, సీపీవో జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, బాసర ఆలయ ఈవో విజయ రామారావు, తదితరులు పాల్గొన్నారు.