నిర్మల్, వెలుగు: పోషణ్ అభియాన్ కార్యక్రమంలో తల్లీబిడ్డలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం పట్టణంలోని టీఎన్జీవోస్ హాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలకు పోషక విలువలున్న ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఈ నెల ఒకటి నుంచి 30 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసంలో సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి పోషకాహారం, శుద్ధమైన తాగు నీరు, పరిశుభ్రతపై వివరించాలన్నారు.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తూ తల్లీబిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. అంతకుముందు వివిధ అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ప్రదర్శించిన పోషక విలువలున్న ఆహార పదార్థాలను కలెక్టర్, అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో నాగలక్ష్మి, డాక్టర్లు నయన రెడ్డి, సౌమ్య, సీడీపీవోలు, సూపర్వైజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.