బాసర ట్రిపుల్ ఐటీలో వసతులు మెరుగుపర్చాలి కలెక్టర్ అభిలాష అభినవ్

బాసర ట్రిపుల్ ఐటీలో వసతులు మెరుగుపర్చాలి కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వీసీ వెంకటరమణ, అధ్యాపకులతో కలెక్టరేట్​లోని తన ఛాంబర్​లో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. కాలేజీలో పరిపాలన, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన వంటి విషయాల్లో పురోగతి సాధించినట్లు తెలిపారు. క్యాంపస్ ప్లేస్​మెంట్లతోపాటు, ప్రభుత్వ, ప్రైవేటు కంపనీల్లో కొలువులు సాధిస్తున్నారని పేర్కొన్నారు.

విద్యార్థులకు స్పోర్ట్స్, కల్చరల్  వంటి వివిధ అంశాల్లో శిక్షణ అందించాలని, సంబంధిత కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రిపుల్​ఐటీ పరిపాలనా విభాగాధికారి రణధీర్ సాగి, అసోసియేటెడ్ డీన్స్ మహేశ్, పావని, ఇతర అధికారులు పాల్గొన్నారు.