
నిర్మల్, వెలుగు: ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి అంశాలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో మారుమూల ప్రాంతాల ప్రజలకు సహాయార్థం ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణిలో ఫోన్ కాల్స్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు ఇంటినుంచే 91005 77132 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేసి, వాట్సప్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చని కలెక్టర్ తెలిపారు. అడిష నల్ కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
నస్పూర్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి అర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ వసూళ్లు, చట్ట వ్యతిరేక రిజిస్టార్ విధివిధానాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంచిర్యాల మండల కేంద్రంలోని నంద్యాల చంద్రమౌళి రెడ్డి ఫిర్యాదు చేశారు. విరాసత్ పట్టా అమలు చేయాలని, భూమి పట్టా ఇప్పించాలని, మంచినీరు, కరెంట్ ఇప్పించాలని దరఖాస్తులు అందాయి.
క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి
ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆసిఫాబాద్అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. కలెక్టరేట్ లో ఆర్డీవో లోకేశ్వరరావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్‌లోని రవిచంద్ర కాలనీకి చెందిన పర్చకి శారద తాను ఎంబీఏ చదివానని, యాక్సిడెంట్లో గాయాలపాలై ఇంటి వద్దనే ఉంటున్నానని జిల్లా కేంద్రంలోని ఏదైనా కార్యాలయంలో ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్, పట్టా పాస్ పుస్తకం, ప్రభుత్వం తీసుకున్న భూమికి పరిహారం ఇప్పించాలని దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.