- ఘనంగా బాలికల దినోత్సవం
నిర్మల్/మంచిర్యాల/నన్పూర్/నేరడిగొండ, వెలుగు: బాలికలు ఉన్నత స్థానాల్లో నిలిచేందుకు చిన్నతనం నుంచే బాటలు వేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని రాంనగర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించగా కలెక్టర్ హాజరయ్యారు. బాలికలు కుటుంబాలకు వెలుగులు నింపే దీపాలన్నారు.
వారి ప్రతిభ, కృషి దేశ అభివృద్ధికి తోడ్పడుతోందన్నారు. బాలికలకు సరైన విద్యావకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, వారిని కేవలం కుటుంబానికి పరిమితం కాకుండా, సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1098 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని బాలికలకు సూచించారు. అడిషనల్కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో పి.రామారావు, డీటీడీవో అంబాజి తదితరులు పాల్గొన్నారు.
బాలికలను కాపాడుకుందాం
భవిష్యత్తు కోసం బాలికలను కాపాడుకుందా మని మంచిర్యాల జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్ట రేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో– బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్ లతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆడపిల్లలను బతికించుకుందాం, వారిని చదివించుకొని, వారి హక్కులను కాపాడుకుందాం, స్వేచ్ఛగా ఎదగనిద్దామని పిలుపునిచ్చారు.
అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని వనితా వాక్కు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రంగు వేణుకుమార్ అన్నారు. బాలికల దినోత్సవాన్ని మంచిర్యాల జడ్పీ గర్ల్స్హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్లకు ఆర్ట్, ఎస్సే రైటింగ్పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. నేరడిగొండ మండలం కుమారి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ లో వేడుకలు నిర్వహించారు. పీఏసీఏస్ చైర్మన్ మందుల రమేశ్ పాల్గొని బాలికలకు చాక్లెట్లు, స్వీట్లు పంచిపెట్టారు. చిన్నారులను శాలువాలతో సత్కరించారు.