నిర్మల్, వెలుగు: బాసర ఆర్జేయూకేటీలో మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ట్రిపుల్ఐటీ అధికారులతో రివ్యూ నిర్వహించారు. వర్సిటీలో విద్యార్థులకు ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిచేయాలన్నారు. వర్సిటీలో చేపట్టే కార్యక్రమాల వివరాల నివేదికలను ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు.
విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేసి మెనూలో వారి సూచనలు, సలహాలు పాటించాలన్నారు. లైబ్రరీ సీటింగ్ సామర్థ్యాన్ని పెంచి, పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేవారికి సౌకర్యంగా ప్రత్యేక పుస్తకాలు సమకూర్చాలని సూచించారు. వర్సిటీ విద్యార్థులతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు మోటివేషన్ క్లాస్లు నిర్వహించాలన్నారు. సమావేశంలో వర్సీటీ ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రణధీర్, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.