
నిర్మల్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ గ్రామీణ మండలం ముజ్గి ప్రైమరీ హెల్త్సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెట్రిక్ హాజరు, ఇన్ పెషేంట్ వార్డు, ఆయుష్ క్లినిక్, డ్రగ్స్ స్టోరూమ్లను సందర్శించి, రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు.
కలెక్టర్ మాట్లా డుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. సరిపడా బెడ్లు, మందులు, ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉండాలని సూచించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్ వో రాజేందర్, వైద్యశాఖ అధికారి శ్రీనివాస్, రవీందర్, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానంద్ తదితరులు పాల్గొన్నారు.