నిర్మల్, వెలుగు: ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ధరణి దరఖాస్తుల పరిష్కారం, రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మండలాల వారీగా నది, వాగులు తదితర ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించాలని.. అక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రధాన రహదారులపై తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలను గుర్తించి సీజ్ చేయాలని, భారీ జరిమానాలు విధించడంతో పాటు సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు.
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మొత్తం 1665 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, తహసీల్దార్, ఆర్డీవో స్థాయిల్లో ఉన్న దరఖాస్తులను మండలాల వారీగా చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, దేవాదాయ, అటవీ, వక్ఫ్ తదితర భూములను సర్వే నంబర్ల వారీగా రికార్డులను సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ సుదర్శన్, ఈడీఎం నదీమ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.