
నిర్మల్, వెలుగు: బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా కొనసాగించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో బాలశక్తి కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారు లతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేకంగా అమలుచేస్తున్న బాలశక్తి కార్యక్రమాన్ని మెరుగ్గా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వైద్య పరీక్షల నిర్వహణ నిరంతరం కొనసాగించాలని, వారికి హెల్త్ కార్డులు అందించాలని వైద్యాధికారు లను ఆదేశించారు.
అనారోగ్య సమస్యలున్న వారికి ప్రత్యేక పోషకాహారం, మందులు అందించాలన్నారు. విద్యార్థుల పోషకులతో సమావేశాలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతులను తెలియజేయాలన్నారు. సీజినల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. పరీక్షల పట్ల భయాన్ని తొలగించేలా, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా మానసిక నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, డీఎంహెచ్వో రాజేందర్, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.