
కుంటాల/కుభీర్, వెలుగు: ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతితో ప్రతి రైతు భూమికి రక్షణ ఉంటుందని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కొత్త చట్టంపై మంగళవారం కుభీర్ లోని రైతు వేదికలో, కుంటాల మండలంలోని అందకూర్‌లో రైతులకు అవగాహన కల్పించారు. గతంలో జరిగిన లోపాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కొత్త చట్టం అమలుతో సాదా బైనామా ప్రక్రియ తిరిగి అమల్లోకి రానుందని చెప్పారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, కుభీర్ మండల ప్రత్యేక అధికారి శంకర్, తహసీల్దార్లు శివరాజ్, కమల్ సింగ్, ఎంపీడీవోలు నవనీత్, లింబాద్రి, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతితో వివాదాలు దూరం
బెల్లంపల్లి రూరల్, వెలుగు: భూ భారతి పోర్టల్‌తో భూ వివాదాలు తగ్గిపోతాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్‌కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామపంచాయతీలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టంతో సాదాబైనామా, ఆర్ఓఆర్, మ్యుటేషన్, అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రికార్డు ప్రకారంగా తప్పులు, మార్పులు చేర్పులు, విరాసత్ పట్టా, పాలు పంపకాలు, దస్తావేజులు సరిచేసుకోవడానికి భూ భారతిలో వెసులుబాటు ఉంటుందన్నారు. కమిటీ ఏర్పాటు చేసి ఆగస్టు 15 నుంచి పేద వారికి లావుని పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాబీర్ఆలీ తదితరులు పాల్గొన్నారు.
భూభారతిలో అప్పీల్ వ్యవస్థ కీలకం
ఆసిఫాబాద్, వెలుగు: భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంలో అప్పీలు వ్యవస్థ కీలకమని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. భూభారతితో రైతు భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, కొత్త చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. జూన్ 2 తర్వాత గ్రామాల్లో పాలనాధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. తహసీల్దార్ రోహిత్, ఎంపీడీవో శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.