
ఖానాపూర్/కోల్ బెల్ట్, వెలుగు: పేదల ఆఖరి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ మండలం తర్లపాడ్‌లో సన్న బియ్యం లబ్ధిదారులు పి.సుజాత–రాజేశ్వర్ దంపతుల ఇంట్లో కలెక్టర్, అధికారులు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
ఈ సన్న బియ్యాన్ని లబ్ధిదారులు దళారులకు అమ్ముకోవద్దని సూచించారు. అంతకుముందు తర్లపాడులోని ఎస్సీ కాలనీలో కలెక్టర్ పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, ఖానాపూర్ తహసీ ల్దార్ సుజాతారెడ్డి, ఎంపీడీవో సునీత, ఎంపీవో రత్నాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి రిజ్వాన తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిలో..
మందమర్రి పట్టణం మొదటి జోన్లో తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులు పొన్నగంటి సుగుణ–లింగయ్య దంపతుల ఇంట్లో రెవెన్యూ ఆఫీసర్లు భోజనం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో వండిన భోజనాన్ని మందమర్రి తహసీల్దార్సతీశ్ కుమార్, డీటీ రవీందర్, ఆర్ఐ గణపతి రాథోడ్, సిబ్బంది తిన్నారు. తహసీల్దార్మాట్లాడుతూ.. ధనికులు తినే సన్నబియ్యాన్ని పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేస్తోందని అన్నారు.