వనపర్తి, వెలుగు: వనపర్తి పట్టణంలోని నల్ల చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా డెవలప్ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ చైర్మన్ పి. మహేశ్, మున్సిపల్ అధికారులతో కలిసి నల్ల చెరువును సందర్శించారు. పట్టణ ప్రజలు వాకింగ్, వ్యాయామం చేసుకునేలా చెరువు కట్టను బలోపేతం చేయాలని, అందుకు అవసరమైన డీపీఆర్ సిద్ధం చేసి ప్రపోజల్స్ పంపాలని ఆదేశించారు. బ్రిడ్జిపై భారీ వాహనాలు నడవకుండా గేట్ పెట్టాలని సూచించారు. ఓపెన్ జిమ్, పిల్లల కోసం ఆట వస్తువులు, రెండు వైపులా మొక్కలు నాటాలని సూచించారు.
అనంతరం ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సన చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మున్సిపల్ శానిటరీ సిబ్బంది, క్యాన్సర్ అనుమానిత మహిళలకు పరీక్షలు చేయడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు సురభి సత్తయ్య, ప్రతినిధి నర్సమ్మ, డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, కలెక్టర్ సతీమణి డా. నిపున్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ పి.కృష్ణ, ఎంఎన్ జే హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, రాంచంద్రరావు పాల్గొన్నారు.