వనపర్తి/ కొత్తకోట, వెలుగు: వ్యవసాయేతర భూములను గుర్తించే ప్రక్రియను స్పీడప్ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆదివారం కొత్తకోట మున్సిపాలిటీలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని దండుగడ్డ ప్రాంతంలో వ్యవసాయ యోగ్యం కాని భూముల గుర్తింపు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన వారికే రైతు భరోసా లబ్ధి చేకూర్చడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
వ్యవసాయ యోగ్యం కాని భూములు, లే అవుట్లు, ఇండ్లు నిర్మించుకున్న భూములు, భూసేకరణ చేసిన భూములను గుర్తించాలని ఆదేశించారు. సర్వే నంబర్ల ఆధారంగా క్షేత్రస్థాయికి వెళ్లి భూములను పరిశీలించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఆధారంగా తయారు చేసిన జాబితా సూపర్ చెక్ చేసి నిజమైన లబ్ధిదారులను పక్కాగా గుర్తించాలన్నారు. జడ్పీ డిప్యూటీ సీఈవో రామమహేశ్వర్, తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో చెన్నమ్మ పాల్గొన్నారు.