
వనపర్తి, వెలుగు: జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో భూసేకరణ, భూ నిర్వాసితుల పునరావాసంపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుద్ధారం పెద్ద చెరువు, గణప సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించిన భూసేకరణపై దృష్టి పెట్టాలన్నారు.
బుద్ధారం పెద్ద చెరువు కెనాల్స్‌కు సంబంధించిన 11.57 ఎకరాల భూమికి వారం రోజుల్లో అవార్డ్ పాస్ చేయాలని, అనంతరం ధరణి పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. చెరువుకు అవసరమైన 205 ఎకరాల భూమికి సంబంధించి, 109 ఎకరాలకు త్వరలో అవార్డ్ పాస్ చేయాలని సూచించారు. మిగిలిన 96 ఎకరాలకు సర్వే చేయించాలని ఆర్డీవోను ఆదేశించారు. సర్వే అనంతరం గ్రామసభ ఏర్పాటు చేయాలని సూచించారు.
ణప సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించి సర్వే పూర్తి అయిన 18 ఎకరాలకు, మరో 388 ఎకరాల స్థలానికి అవార్డ్ పాస్ చేయాలని, ఇరిగేషన్ శాఖ తరపున వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మిగిలిన 197 ఎకరాలకు సర్వే చేయించాలని సూచించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ ఈఈ కేశవరావు, డీఈలు పాల్గొన్నారు.