వనపర్తి, వెలుగు: ఓటర్ లిస్టులో డబుల్ ఓట్లు ఉంటే వాటిని తొలగించాలని, మార్పులు ఉంటే ఫారం 8 ద్వారా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి బీఎల్వోలను ఆదేశించారు. ఆదివారం వనపర్తిలోని గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లోని పోలింగ్ బూత్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ లో ఓటరు జాబితాను తప్పకుండా ప్రదర్శించాలన్నారు. 2025 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. బీఎల్వోలు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎవరైనా ఓటర్లు మరణిస్తే వారిని జాబితా నుంచి తొలగించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మున్సిపాలిటీలోని బండారు నగర్ లో ఎన్యుమరేటర్లు సర్వే చేస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. సూపర్ వైజర్లు సర్వేను పర్యవేక్షించాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలన్నారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్
ఉన్నారు.