వనపర్తి, వెలుగు: విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథ్స్ అంటే భయం ఉంటుందని, దీంతో చాలా మంది ఈ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతుంటారని కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. పాఠశాలను ప్రాక్టికల్‌గా చెబితే సులువుగా అర్థం చేసుకుంటారని తెలిపారు. బుధవారం కలెక్టర్ తన ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన 116 సైన్స్ ఫెయిర్ కిట్లను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూళ్లకు అందజేశారు.
ఇండియా లిట్రసీ ప్రోగ్రాం రూపొందించిన సైన్స్ ఫెయిర్ కిట్లను ఇప్పటి వరకు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు 83 స్కూళ్లకు 244 యూనిట్లు అందించగా, మిగిలిన స్కూళ్లకు రూ. 6.57 లక్షలతో కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేశారు. ప్రతి సైన్స్ టీచర్ వీటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈవో అబ్దల్ ఘని, డీడబ్ల్యూవో సుధారాణి, ఆర్డీఎస్ డైరెక్టర్ చిన్నమ థామస్, జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.