ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు

మదనాపురం, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేందుకు గ్రామ, మున్సిపల్  వార్డు కమిటీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్  ఆదర్శ్  సురభి తెలిపారు. తహసీల్దార్ ఆఫీస్​లో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. 

ఈ పథకం కింద అర్హత ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్  వార్డుల నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్  కమిషనర్ల నుంచి లిస్ట్​ తెప్పించుకొని జిల్లా ఇన్​చార్జి మంత్రి ఆమోదంతో కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. 

గ్రామ, వార్డు కమిటీలు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశాక, తీర్మానం చేసి ఎంపీడీవోలు, మున్సిపల్  కమిషనర్లకు పంపాలని చెప్పారు. ఈ కమిటీలు ఈ నెల  21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల తుది జాబితా తయారు చేస్తాయని తెలిపారు.