
వనపర్తి, వెలుగు: గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని వివిధ విభాగాల నిర్మాణాలను అనుకున్న టైంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ఆదర్శ్సురభి ఆదేశించారు. గురువారం ఆయన గవర్నమెంటు మెడికల్‌కాలేజీ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో నిర్మాణంలో ఉన్న రెండు హాల్స్ ని నెల రోజుల్లోపు పూర్తి చేసి అప్పగించాలని ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మొత్తం ఆగస్టు లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
గవర్నమెంటు హాస్పిటల్నూ ఆయన సందర్శించి రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కంటి శస్త్ర చికిత్స విభాగంలో సేవలను మెరుగుపరచాలన్నారు. డయాలసిస్ విభాగాన్ని సందర్శించి చికిత్స, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగారావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కిరణ్మయి, ఎన్ సీడీ డాక్టర్ రామచంద్ర, ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ చర్యలు
యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో ఐకేపీ, పీఏసీఎస్, మిల్లుల యజమానులు, రవాణా సంస్థలతో ధాన్యం సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సెంటర్లలో మౌలిక సదుపాయాలు లేనిపక్షంలో కమిషన్ నిలిపివేస్తామని హెచ్చరించారు.