
వనపర్తి, వెలుగు: మహిళా సంఘాల ద్వారా ప్రతి మండలానికి ఒక స్వయం ఉపాధి యూనిట్ నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో డీఆర్డీవో అధికారులు, ఏపీఎంలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల స్వయం ఉపాధి, సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.
పెట్రోల్ బంక్, గోదాములు, రైస్ మిల్లు, ఇతరత్రా వ్యాపారం మొదలు పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలు యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకు వస్తే జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ శాతం ఐకేపీకి కేటాయిస్తామని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారు చనిపోతే, వారి స్థానంలో భాగస్వామికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయడంలో అలసత్వం చేయవద్దని ఆదేశించారు.
.జిల్లాలో 451 మంది వృద్ధాప్య పెన్షన్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిశీలించి ఏప్రిల్ 10 లోగా పెన్షన్ మంజూరు చేస్తారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను కలెక్టర్ ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ యాదయ్య, బ్యాంక్ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, డీఆర్డీవో ఉమాదేవి, డీపీఎం అరుణ పాల్గొన్నారు.