
వనపర్తి, వెలుగు: మండల, క్లస్టర్ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ హాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. త్వరలో పంట కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే విషయాలపై వ్యవసాయ విస్తీర్ణాధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. పామాయిల్ సాగు పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
నల్లచెరువు ట్యాంక్ బండ్‌ని తీర్చిదిద్దాలి
వనపర్తి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేలా నల్లచెరువు ట్యాంకుబండ్ ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. నల్లచెరువు ట్యాంక్ బండ్ పై మున్సిపాలిటీ ద్వారా నిర్మిస్తున్న ఓపెన్ జిమ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ట్యాంక్ బండ్‌కు ఇరువైపులా అందమైన ఆర్చ్ నిర్మించాలని, భారీ వాహనాలు వెళ్లకుండా గేటు ఏర్పాటు చేయాలన్నారు. డీఏవో గోవింద్‌నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్అండ్ బీ డీఈ సీతారామస్వామి, తహసీల్దార్ రమేశ్ రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, తదితరులు ఉన్నారు.