పిల్లలకు దొడ్డుబియ్యం వండడమేంటి? : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

పిల్లలకు దొడ్డుబియ్యం వండడమేంటి? : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి/ఖిల్లాగణపురం, వెలుగు : ఖిల్లాగణపురంలోని మోడల్​ స్కూలు విద్యార్థులకు దొడ్డుబియ్యంతో అన్నం వండి పెట్టడంపై   కలెక్టర్​ ఆదర్శ్​ సురభి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మండంలోని తెలంగాణ మాడల్​ స్కూల్​, గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్లో   మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేయగా, దొడ్డు బియ్యం  వండినట్టు గుర్తించారు. దీంతో  సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం మాత్రమే వడ్డించాలని,  దొడ్డు బియ్యం స్టాక్ ను వెనక్కి పంపించాలని, నాణ్యమైన బియ్యం మాత్రమే దించుకోవాలని ఆదేశించారు.  

హాస్టల్​లో  స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు.   పదో తరగతి బోర్డు పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  మార్చి 21 నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్  పై ఆరా తీశారు.  అనంతరం మామిడి మాడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఉగాది పండగ లోపు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశించారు.   పీఆర్​ ఈఈ  మల్లయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, తహసిల్దార్ సుగుణ, ఎంపీడీవో వెంకటాచారి, ఎంఈఓ, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.