వనపర్తి జిల్లాలో కచ్చా లే అవుట్​ ప్లాట్లపై చర్యలు : కలెక్టర్ ఆదర్శ్​సురభి

వనపర్తి జిల్లాలో కచ్చా లే అవుట్​  ప్లాట్లపై చర్యలు : కలెక్టర్ ఆదర్శ్​సురభి

వనపర్తి, వెలుగు :  కచ్చా లే అవుట్లు, ఎల్ఆర్ఎస్ చేసుకోని  ప్లాట్ల పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదర్శ్​ సురభి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ లే అవుట్లపై  కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, లైసెన్స్డ్ టౌన్ ప్లానర్లు , టౌన్ ప్లానింగ్ ఇంజనీర్లతో    కలెక్టర్  సమీక్ష నిర్వహించారు. 2020 తర్వాత కచ్చా లేఅవుట్ చేసిన వారు, వాటిలో  ప్లాట్లు తీసుకున్నవారు  జిల్లాలో 29 వేల మంది ఎల్ఆర్ఎస్  కోసం దరఖాస్తు చేసుకున్నారని  తెలిపారు. వారి  నుంచి డబ్బులు వసూలు చేసి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్  ఆదేశించారు. 

ఇప్పటికే జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల ద్వారా దాదాపు 25 వేల మందికి నోటీస్ లు జారీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో క్రమబద్ధీకరణ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.  ఎల్ఆర్ఎస్ లేని వారు మార్చి 31 తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎలాంటి రాయితీ లేకుండా ప్రస్తుత మార్కెట్ వాల్యూ కు 14 శాతం పెనాల్టీతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.   

ప్లాట్ల రాళ్లతొలగింపు

కచ్చా లేఅవుట్​ లలో  అక్రమంగా వేసిన ప్లాటు రాళ్లను మున్సిపల్​ ఆఫీసర్లు మంగళవారం వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు మున్సిపాలిటీల్లో  తొలగించారు. 

కొత్తకోట : కొత్తకోట మున్సిపాలిటీలో  కలెక్టర్ ఆదేశాల మేరకు  మంగళవారం ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోని లేఅవుట్ వెంచర్లతో  పాటు యజమానుల ప్లాట్ సరిహద్దులను మునిసిపల్ సిబ్బంది తొలగించారు. మిగిలిన ప్లాట్ యజమానులు స్పందించి త్వరగా ఎల్ఆర్ఎస్ పనులు పూర్తి చేసుకోవాలని ప్రజలకు మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అడినల్​ కలెక్టర్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సబ్ రిజిస్ట్రార్, తదితరులు పాల్గొన్నారు.