వనపర్తి, వెలుగు: జిల్లాలోని రోడ్ల రిపేర్లను వెంటనే కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ తో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో రోడ్ల రిపేర్లు, రోడ్ వైడెనింగ్కు ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వనపర్తి నుంచి బిజినేపల్లి మీదుగా హైదారాబాద్, పాన్ గల్, పెబ్బేరు రోడ్ రిపేర్లు, వైడెనింగ్ వర్క్స్‌లో ఎదురవుతున్న ఇబ్బందులపై నివేదిక ఇస్తే.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వే సైడ్ మార్కెట్ బిల్డింగ్‌లను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెబ్బేరు రోడ్డులో 1.6 ఎకరాల స్థలంలో రూ. 2.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక వే సైడ్ మార్కెట్ ను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పరిశీలించారు. 78 షాపుల తో పాటు మరుగుదొడ్లు, క్యాంటీన్, తాగు నీరు, ఫ్యాన్ లు, పిల్లలు ఆదుకునేందుకు ఆట స్థలం వంటి సకల సదుపాయాలతో నిర్మించిన వే సైడ్ మార్కెట్ ను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు 24 గంటలు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లల వార్డు, ప్రసూతి వార్డు, శస్త్ర చికిత్సల వార్డు, ఎస్ ఎన్.సి. యు వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న బెడ్ ల వివరాలు, వివిధ రకాలైన రిజిస్టర్లను పరిశీలించారు. కార్యక్రమాలలో ఆర్ అండ్ బీ ఈఈ దేశ్యనాయక్, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ స్వర్ణసింగ్ తదితరులు పాల్గొన్నారు..