వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో ఎఫ్ సీఐకి బియ్యం అందజేయని మిలర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్ లో సివిల్ సప్లై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వడ్లు తీసుకొని బియ్యం ఇవ్వకపోవడం అనేది సరైంది కాదన్నారు. జిల్లాలో కొందరు మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. అబ్రార్ ఇండస్ట్రీ, సత్య ఇండస్ట్రీ, తిరుమల ఇండస్ట్రీ, శ్రీ వేంకటేశ్వర ఇండస్ట్రీలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
రూల్స్ పాటించని మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా కాలాయాపన చేస్తూ, మిల్లర్లకు సహకరిస్తున్న సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కు సూచించారు. సీఎంఆర్ ఇవ్వని మిల్లులకు ఇక నుంచి వడ్లు ఇవ్వవద్దని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఫారం–2 ద్వారా నోటీస్ ఇచ్చిన మిల్లులకు ఫారం–3,4 ద్వారా నోటీసులు జారీ చేయాలన్నారు. సీఎంఆర్ విషయంలో గవర్నమెంట్ రూల్ ప్రకారం మిల్లర్లు నడుచుకోవాలని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. అడిషనల్ కలెక్టర్ ఎం నగేశ్, జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్, డీఎం ఇర్ఫాన్ పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
జిల్లాలోని అన్ని కేబీబీవీల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని ఘనపురం కేజీబీవీని కలెక్టర్ పరిశీలించారు. కేజీబీవీలో డెంగ్యూ కేసు నమోదు కావడంతో కలెక్టర్ సందర్శించి పరిసరాలను పరిశీలించారు. జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పనులు చేపట్టాలని జీసీడీవో శుభలక్ష్మిని ఆదేశించారు. ఈగలు, దోమలతో వచ్చే వ్యాధులపై స్టూడెంట్లకు అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం పెద్దమందడి మండలం జంగమాయ పల్లి, ఘనపూర్ మండలం ఘణపసముద్రం రిజర్వాయర్, కర్నెతాండ, గోపాలపేట మండలంలో పర్యటించారు. పెద్దమందడి మండలం జంగమాయ పల్లిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను ఆన్లైన్ అప్ లోడ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీఏవో గోవింద్ నాయక్, ప్రత్యేకాధికారి సుధీర్ రెడ్డి, తహసీల్దార్ పాండు తదితరులు పాల్గొన్నారు.