రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ ఆదర్శ్  సురభి

రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ ఆదర్శ్  సురభి

వనపర్తి, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్  సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో ఆర్అండ్​బీ ఆధ్వర్యంలో కలెక్టర్  అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైవేపై వెల్టూర్, పాలెం జంక్షన్, మదర్ థెరిసా కొత్తకోట కూడలి, ఆమడబాకుల, నాటేవల్లి, తోమాలపల్లి, ఆనంద భవన్  జంక్షన్, పెబ్బేరు, మోడరన్  హైస్కూల్  పెబ్బేరు, రంగాపూర్  కూడలిని బ్లాక్​ స్పాట్​లుగా గుర్తించారని పేర్కొన్నారు.

ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా రోడ్డు ఆక్రమణకు గురైతే నోటీసులు జారీ చేసి వాటిని తొలగించాలన్నారు. రోడ్డు మలుపుల్లో ముళ్ల పొదల తొలగింపు వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్లార్లను వాహనాలు పార్కింగ్  చేసేందుకు మాత్రమే ఉపయోగించేలా చూడాలన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటికే అన్ని పాఠశాలల్లో మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేశారని, కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ ఆర్.గిరిధర్, అడిషనల్​ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేశ్,  అడిషనల్  ఎస్పీ తేజావత్  రాందాసు, ఆర్డీవో పద్మావతి, డీటీవో మానస,  పీఆర్​ ఈఈ మల్లయ్య, డీడబ్ల్యూవో లక్ష్మమ్మ, సాయినాథ్ రెడ్డి పాల్గొన్నారు.