పీహెచ్​సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

పీహెచ్​సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు: జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించాలని, పీహెచ్​సీల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదర్శ్​ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్  కాన్ఫరెన్స్  హాల్​లో జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. జనవరి నుంచి సెప్టెంబర్  వరకు జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలు, అందుకు గల కారణాలను సమీక్షించారు. నలుగురు మహిళలు, 56 మంది శిశువులు చనిపోయినట్లు డీఎంహెచ్​వో కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. మాతృ మరణాలపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హై రిస్క్  ఉన్న గర్భిణుల ఆరోగ్యంపై మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తప్పనిసరిగా గత ఆరోగ్య పరిస్థితిపై   వివరాలు అడిగి తెలుసుకోవాలని, ఆ వివరాలను ఏఎన్సీ చెకప్ లో నమోదు చేయాలని సూచించారు. హై రిస్క్  ఉన్న గర్భిణులకు ఈసీజీ టెస్ట్​ చేయాలన్నారు. శిశు మరణాలపై కేసుల వారీగా కారణాలు లిఖిత పూర్వకంగా అందించాలని ప్రోగ్రాం ఆఫీసర్ ను ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్  సంచిత్  గంగ్వార్, డీఎంహెచ్​వో జయచంద్ర మోహన్, గైనకాలజిస్ట్  డాక్టర్​ కిరణ్మయి, చిన్నమ్మ థామస్, సాయినాథ్ రెడ్డి పాల్గొన్నారు.