వనపర్తి జిల్లా సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లా సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు : మార్చి 2న సీఎం రేవంత్​రెడ్డి వనపర్తి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సీఎం జిల్లా పర్యటన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష  నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలని చెప్పారు. పారిశుధ్యం, తాగునీరు బాధ్యతలను మున్సిపల్ కమిషనర్ కు అప్పగించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం  పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. 

సభాస్థలిని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే..

మార్చి 2న జరిగే సీఎం రేవంత్​రెడ్డి బహిరంగ సభాస్థలిని నాగర్​కర్నూల్ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్​ఆదర్శ్​ సురభితో కలిసి పరిశీలించారు. గవర్నమెంట్​ పాలిటెక్నిక్​ కాలేజీ వెనుక హెలిప్యాడ్ ఏర్పాట్లు, ముందు భాగంలో నిర్వహించనున్న  ప్రజాపాలన- ప్రగతిబాట బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించనున్న వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలపై అధికారులతో చర్చించారు.  వారి వెంట డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్​రెడ్డి, వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్ శ్రీనివాస్​గౌడ్​, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీసీ ప్రెసిడెంట్​ రాజేంద్రప్రసాద్​తదితరులు ఉన్నారు.