సిజేరియన్ ఆపరేషన్లపై కలెక్టర్ సీరియస్

సిజేరియన్ ఆపరేషన్లపై కలెక్టర్ సీరియస్

వనపర్తి టౌన్: వనపర్తి జిల్లాలో సిజేరియన్ డెలివరీలు అధికంగా జరుగుతున్నాయని, దీనిని నియంత్రించాలని కలెక్టర్ ఆదర్శ్  సురభి ఆదేశించారు. కలెక్టరేట్​లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, డాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ డెలివరీలు అధికం కావడంపై హెల్త్ డిపార్మెంట్ ఆఫీసర్లపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ప్రైవేట్ లో 54 శాతం డెలివరీలు  జరిగితే.. అందులో 75 శాతం సిజేరియన్లే ఉండటం ఏంటని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రులను క్రమం తప్పకుండా విజిట్ చేసి కేసులపై ఆరా తీయాలన్నారు. 

అవసరం లేకున్నా సిజేరియన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సిజేరియన్లతో గర్భిణిల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో సైతం ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో  డా. జయచంద్ర మోహన్, మెడికల్ ఆఫీసర్లు,  ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్​రహిత జిల్లాగా వనపర్తి

వనపర్తి: వనపర్తిని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. కలెక్టరేట్​లో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. జిల్లాలో ఇప్పటివరకు గంజాయి సాగు చేస్తున్న వారిపై మూడు కేసులు, వాడిన వారిపై 17 కేసులు నమోదైనట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం, సరఫరా జరిగితే 8712671111 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు.  జిల్లాలో డ్రగ్స్ అనర్థాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్​ గంగ్వార్, డీఎఫ్​వో నవీన్ రెడ్డి, ఆర్డీవో పద్మావతి, డీఎస్పీ కృష్ణ కిషోర్, ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ ప్రభు వినయ్, ఆర్​టీవో  మానస, డీఈవో గోవిందరాజు, సంక్షేమ శాఖ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.