బయ్యారంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

మహబూబాబాద్, వెలుగు: బయ్యారం మండలంలో మంగళవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. నామాలపాడు ఏకలవ్య హైస్కూల్ (హాస్టల్) తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సౌకర్యాలు కల్పించాలని, రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. 

గంధంపల్లి, బయ్యారం, ఇరుసులపురం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ వివరాలను, ఓపీ, ఐపీ రిజిస్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్ విజయ, ఎంపీడీవో తదితరులున్నారు