
- కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: బ్యాంక్ రుణాల టార్గెట్రీచ్అవ్వాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో క్రాఫ్ లోన్స్ 69.50 శాతం, అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ 107.44 శాతం, స్వయం సహాయక సంఘాల రుణాలు 109.48 శాతం లక్ష్యాన్ని చేరాయన్నారు.
పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఇబ్బంది లేకుండా అర్హత కలిగిన రైస్ మిల్లర్లకు వెంటనే బ్యాంకు గ్యారంటీలను మంజూరు చేయాలని చెప్పారు. రుణాలు తీసుకున్నవారు యూనిట్లు స్థాపించారా లేదా పరిశీలించాలని పేర్కొన్నారు.
వడదెబ్బ జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి
ఎండల తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు, వ్యవసాయ, ఉపాధిహామీ కూలీల పని సమయంలో మార్పులు చేసి, తాగునీరు, ఓఆర్ఎస్ ఇతర వసతులు కల్పించాలన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఆర్బీఐఎల్డీవో సాయిచరణ్ రెడ్డి, డీఆర్డీవో మధుసూదనరాజు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ సత్యనారాయణమూర్తి, నాబార్డు ఏజీఎం చంద్రశేఖర్, డీఏవో విజయనిర్మల, డీవీహెచ్ వో కిరణ్ కుమార్, డీహెచ్ఎస్ వో మరియన్న, మెప్మా పీడీ విజయ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశి రామ్ నాయక్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీమన్నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.