మహబూబాబాద్, వెలుగు: తాగునీటి కొరత రాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పంచాయతీ, మున్సిపల్, నీటిపారుదల ఇంజనీరింగ్, మిషన్ భగీరథ ఆఫీసర్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని బోర్ల పనితీరుపై నివేదికలు ఇవ్వాలని,మరమ్మత్తులకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాలలోని త్రాగునీటి వనరులను తక్షణమే పునరుద్ధరించాలన్నారు.
నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.నీటి వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. తాగునీటి పైపులైన్ల లీకేజీలను గుర్తించి నీరు వృథాకాకుండా సత్వరమే మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, జడ్పీ సీఈవో రమాదేవి, సీపీవో సుబ్బారావు, ఇరిగేషన్ ఈఈ సమ్మిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.