మహబూబాబాద్ , వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపును స్వాగతిస్తూ ఈనెల14నజిల్లా వ్యాప్తంగా వేడుకలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 125 విద్యాసంస్థల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సంక్షేమ వసతి గృహాలు,పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తారన్నారు.
సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి, జడ్పీ సీఈవో పురుషోత్తం, డీఈవో రవీందర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహస్వామి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సైదా నాయక్, సీపీవో సుబ్బారావు, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, డీపీవో హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల్లో రేపటి నుంచి నూతన డైట్
రేగొండ, వెలుగు: సంక్షేమ వసతి గృహలు, గురుకులాలు, కేజీబీవీ పాఠశాలల్లో శనివారం నుంచి నూతన డైట్‌ను పండుగలాగా చేపట్టాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో పెంచిన చార్జీలతో నూతన డైట్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ప్రోగ్రాంను పండుగ వాతావరణంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు తెలియజేయాలన్నారు.
గురువారం ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలోని 61 పాఠశాలల్లో నూతన డైట్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వనించి వారి సమక్షంలోనే వేడుకలు ప్రారంభించాలన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు పెట్టే మెనూ గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు.