
మహబూబాబాద్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా తాగునీరు సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్ యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. శుక్రవారం కేసముద్రం మండలం రంగాపురంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీని కలెక్టర్ పరిశీలించారు.
వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు తాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. వేసవికాలంలో మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని, ప్రతిరోజు ఇండ్లకు, హాస్టళ్లకు షెడ్యూలు ప్రకారం తాగునీటిని సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ లక్ష్మారెడ్డి తదితరులున్నారు.