ముందస్తు ఫ్లడ్ మేనేజ్​మెంట్ ప్లాన్ రూపొందించాలె..కలెక్టర్​ అనుదీప్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గోదావరి వరదలపై ముందస్తు ఫ్లడ్ మేనేజ్​మెంట్ ప్లాన్​ రూపొందించాలని ఆఫీసర్లను కలెక్టర్​ అనుదీప్​ ఆదేశించారు. గోదావరి వరదలపై కలెక్టరేట్ లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదల టైంలో  ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ప్లాన్​ చేయాలన్నారు.  ముంపు గ్రామాల ప్రజలను  తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. గోదావరి వరదలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. రానున్న నాలుగు నెలల వరకు సరిపోయే విధంగా నిత్యావసర వస్తువుల స్టాక్​ ఉంచాలని సివిల్​ సప్లయీస్​ఆఫీసర్​ను ఆదేశించారు. వరద పర్యవేక్షణకు సెక్టోరియల్​, జోనల్​ అధికారులను నియమించనున్నట్టు తెలిపారు.  అత్యవసర సమయాల్లో హెలికాప్టర్​ సేవల కోసం హెలీప్యాడ్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్​బీ ఆఫీసర్లను ఆదేశించారు. 

వరద సమాచారాన్ని తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.  వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాశాఖాధికారులకు సూచించారు. గొత్తికోయల ఆవాస ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భద్రాచలంలో వరద నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లను అందుబాటులో ఉంచాలన్నారు. భద్రాలచం సబ్​ కలెక్టరేట్​లో 24గంటలు పనిచేసే విధంగా ఫ్లడ్​ కంట్రోల్​ రూం ఏర్పాటు చేయాలన్నారు. లైఫ్​ జాకెట్లు, గజ ఈతగాళ్లు, నాటు పడవలు, బోట్లు అందుబాటులో ఉంచాలన్నారు.  మీటింగ్​లో వివిధ శాఖల  అధికారులు పాల్గొన్నారు.

 ఓటర్ల నమోదుపై ఫోకస్​ పెట్టాలి

ఓటర్ల నమోదు తక్కువగా ఉన్న మండలాలపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టాలని కలెక్టర్ అనుదీప్​ఆదేశించారు. ఈఆర్వో, ఏఈఆర్వోలు, ఎలక్షన్​ డీటీలతో కలెక్టరేట్​లో మంగళవారం నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. పినపాక, అశ్వాపురం, కరకగూడెం, బూర్గంపహడ్​, ఆళ్లపల్లి మండలాల్లో ఓటరు నమోదు తక్కువగా ఉందన్నారు. కొత్తగూడెం, భద్రాచలం పోలింగ్​ బూత్​లలో 1,500కంటే ఎక్కువ ఓట్లు ఉన్నందున మరో పోలింగ్​ బూత్​ ఏర్పాటు కోసం నిర్దేశించిన ఫారంలో పొందుపర్చాలన్నారు.  జూలై 11,12 తేదీల్లో పూర్తి స్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.  ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక్​ చక్రవర్తి, చీఫ్ ఎలక్షన్ నోడల్​ఆఫీసర్​ మధుసూదనరావు, ఆర్డీఓలు, మున్సిపల్​ కమిషనర్లు పాల్గొన్నారు.

గ్రూప్-4 ఎగ్జామ్​కు  ఏర్పాట్లు చేయాలి

జూలై 1న జరిగే గ్రూప్​–4 ఎగ్జామ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆఫీసర్లను  కలెక్టర్​అనుదీప్​ఆదేశించారు. కలెక్టరేట్​లో చీఫ్​ సూపరింటెండెంట్లు, లైజనింగ్, రూట్​ఆఫీసర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్​–1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్​–2 పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో  77 కేంద్రాల్లో ఎగ్జామ్​ నిర్వహిస్తున్నామన్నారు.  27వేల మంది ఎగ్జామ్​కు అటెండ్​ కానున్నారని తెలిపారు.   మీటింగ్ లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు
 పాల్గొన్నారు.