వేములవాడ, వెలుగు: వేములవాడ శైవ క్షేత్రంలో మహాశివరాత్రి జాతర నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములవాడలో జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్మహాజన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరను విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
3 షిఫ్టుల్లో కార్మికులను నియమించుకొని ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను నిరంతరాయంగా శుభ్రం చేయాలన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైనన్ని టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, దేవస్థానం క్యూలైన్లు పరిసర ప్రాంతాలు రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఈసారి భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో అవసరమైన మేర తాత్కాలిక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. బందోబస్తు సిబ్బందికి అవసరమైన వసతి ఏర్పాటు చేయాలన్నారు. డీఎస్పీ నాగేంద్ర చారి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఈఈ రాజేష్, ఏఈవో జయ కుమారి, సీఐ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.