
కామారెడ్డి టౌన్, వెలుగు : ప్రభుత్వ ఆదేశాలతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వడ్ల కొనుగోలు సెంటర్లను పెంచుతామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం సెర్ఫ్ లక్ష్యాలపై పంచాయతీ రాజ్ శాఖ సెక్రటరీ లోకేశ్‌కుమార్ వీసీ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. మహిళ సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ల ఏర్పాటు, పెట్రోల్ బంక్స్ ఏర్పాటు, ఫించన్లు తదితర అంశాలను వివరించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు.
జిల్లాలో ఇది వరకు వడ్ల కొనుగోలు సెంటర్లు 27 ఉన్నాయని వీటిని 156కు పెంచనున్నామన్నారు. సెంటర్లకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ సమకూర్చాలని అధికారులకు సూచించారు. పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. స్టూడెంట్స్ యూనిఫాం కుట్టే ఏర్పాట్లు చేయాలన్నారు. సదరం క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో సురేందర్, ఎల్డీఎం రవికాంత్, డీసీవో రాంమోహన్, సివిల్ సప్లయ్ మేనేజర్ రాజేందర్, డీఎస్వో మల్లికార్జునబాబు, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.