
- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
తాడ్వాయి, వెలుగు : వేసవిలో కూలీలకు ‘ఉపాధి’ పనులు కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని సంతాయిపేట గ్రామ భీమేశ్వరాలయ సమీపంలో చెక్ డ్యాం పూడికతీత పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. గ్రామంలో 316 జాబ్ కార్డులు ఉండగా, 280 కూలీలు పనులకు హాజరవుతున్నారన్నారు. పోస్టాఫీస్ ద్వారా కూలీ డబ్బుల చెల్లింపులు ఆలస్యమవుతుందని కూలీలు కలెక్టర్ కు విన్నవించారు. పోస్టల్ శాఖ నుంచి కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా కూలీ చెల్లించేలా ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభి వృద్ధి అధికారి సురేందర్‌కు సూచించారు.
అనంతరం భీమేశ్వరాలయంలో పూజలు చేశారు. పురాతన ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు. గ్రామ నర్సరీలోని మొక్కలను పరిశీలించి, ఇంటింటికీ పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు ప్రమీల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. బ్రహ్మాజీవాడ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలకు నీళ్లు పోశారు. ఏవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించాలని, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రాజారాం, ఇన్చార్జి తహసీల్దార్ రేఖ, ఎంపీడీవో సాజిద్ పాల్గొన్నారు.