
కామారెడ్డి, వెలుగు : భూభారతితో రైతులకు ఉచిత న్యాయ సాయం అందుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సుల్లో కలెక్టర్ మాట్లాడారు. గతంలో ధరణిలో అప్పీలుకు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, ‘భూభారతి’తో అప్పీలుకు అవకాశం ఉందన్నారు. లైసెన్స్ సర్వేయర్‌తో భూ సర్వే చేయించి మ్యాప్ తయారు చేయించుకుంటే పాస్‌బుక్‌లో ఎంట్రీ చేస్తారన్నారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే, ఎంక్వైరీ చేసి నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకుంటామన్నారు. పంట పొలాల్లో ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వుకోవాలని రైతులకు సూచించారు. ఉపాధి హామీ స్కీం కింద ఈ పనులు చేపట్టవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వీణ, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, రైతులు పాల్గొన్నారు.
వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి
వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలని ఆఫీసర్లను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శనివారం దోమకొండ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీటి సౌకర్యం, నీడ వసతి కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇంటి సర్వేను కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు. డీఎస్వో మల్లికార్జున్, డీఎం రాజేందర్, డీసీవో రామ్మోహన్, స్పెషల్ అధికారి జ్యోతి ఉన్నారు.
అంబలి, చలి వేంద్రం ప్రారంభం
కామారెడ్డి కలెక్టరేట్లో టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం, చలి వేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ చందర్‌నాయక్, టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్ నరాల వెంకట్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎం.నాగరాజు, ప్రతినిధులు దేవరాజు, సాయిలు, శ్రావణ్, చక్రదర్, లక్ష్మణ్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
మే 6న జాబ్‌మేళా
హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో టెక్ బీ పోగ్రాం కోసం మే 6న కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోని ఆడిటోరియంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. 2024, 2025లో ఇంటర్ కంప్లీట్ చేసిన ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బీపీసీ, ఒకేషనల్ కంప్యూటర్ విద్యార్థుల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్సెస్సీ సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ తో హాజరుకావాలని తెలిపారు.