కామారెడ్డి, వెలుగు: స్టూడెంట్స్ప్రతీరోజు కళాశాలకు వచ్చి చక్కగా విద్యనిభ్యసించాలని కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ అన్నారు. శనివారం దోమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పేరెంట్స్ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందన్నారు. విద్యార్థులు ప్రతీరోజు కాలేజీకి వచ్చి శ్రద్ధగా చదువుకోవాలన్నారు. సమస్యలుంటే ప్రిన్సిపాల్ కు తెలియజేయాలన్నారు.
తమ పిల్లలు రోజు కళాశాలకు వెళ్తున్నారో లేదో తెలుసుకోవాలని పేరెంట్స్కు సూచించారు. విద్యార్థులు హాజరుకాకుంటే పేరెంట్స్కు తెలపాలన్నారు. ఆర్టీసీ బస్సులు కళాశాల వద్ద ఆపడానికి, వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కోసం సమయానుకూలంగా బస్సులను నడిపే విధంగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడతానని కలెక్టర్ తెలిపారు. ముందుగా ప్రిన్సిపాల్ జి.శంకర్ మాట్లాడారు.
కళాశాలలో 299 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ప్రతీ నెల పేరెంట్స్ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సలాం, తహసీల్దార్ సంజయ్ రావు, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి జ్యోతి, పేరెంట్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాలి
కామారెడ్డి, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాల ద్వారా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై ఐడీఓసీలో రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్ కు అవగాహన కల్పించారు. అనంతరం క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవడంతో పాటు, తోటి విద్యార్థులకు, కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగు వారికి అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్ లను నియమించామని తెలిపారు. మొత్తం 61 పాఠశాల ద్వారా 122 మంది అంబాసిడర్స్ లను నియమించినట్టు చెప్పారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ..జిల్లాలో 520 గ్రామాలుండగా గత ఏడాది 500లకు పైగా ప్రమాదాలు జరిగాయన్నారు. సగటున ప్రతీ గ్రామంలో ఒక ప్రమాదం జరిగిందని తెలిపారు. జిల్లాలో రెండు జాతీయ రహదారులున్నాయని, వాహనదారులు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. ప్రమాదాలకు కారణమైనవారికి కొత్త చట్టం ప్రకారం పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని తెలిపారు.