లింగంపేట,వెలుగు: ప్రభుత్వ సహకారంతో డ్వాక్రా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ అన్నారు. లింగంపేట మండలం బాయంపల్లి గ్రామంలో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న చేపల పెంపకం, చేపలదాణా తయారీ, గొర్రెలు, మేకలు, కోళ్లపెంపకం యూనిట్లను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. గ్రామానికి చెందిన కుంట యశోదకు బ్యాంక్లింకేజీ, స్త్రీనిధి ద్వారా రూ.3.50 లక్షల రుణం మంజూరు చేయడంతో ఆమె చేపల పెంపకం, చేపల దాణా తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. చేపల పెంపకందారులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతిని ఆదేశించా రు. స్వయం ఉపాధి కోసం చేపలు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం చేపట్టే డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కగా నిర్వహించాలి
ఎల్లారెడ్డి,వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలం మీసాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు మంజూరు చేసేందుకు సర్వే చేపట్టినట్లు తెలిపారు.