కామారెడ్డి, వెలుగు: ఇంటింటి సర్వే కోసం ఎన్యుమరేటర్లను నియమించుకోవాలని కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేకు ఎన్యుమరేటర్లుగా ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులను నియమించుకోవచ్చన్నారు. ఎన్యుమరేటర్లకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీపీఓ రాజారాం, జడ్పీ సీఈఓ చందర్, జిల్లా విద్యా శాఖాధికారి రాజు, ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు తదితరులు
పాల్గొన్నారు.
ధాన్యం తూకం పక్కగా వేయాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం పక్కాగా వేయాలని, ధాన్యంలో చెత్త లేకుండా క్లీన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రామారెడ్డి మండలం పోసాని పేట్ గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని శుభ్ర పరచాలని ప్యాడీ క్లీన్ మానిటరింగ్ అధికారిని ఆదేశించారు. అలాగే 40.600 కిలోల ధాన్యాన్ని బస్తాలో నింపి పక్కాగా తూకం వేయాలన్నారు.
కొనుగోలు కేంద్రంలో రైతులకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రాం మోహన్, మానిటరింగ్ అధికారి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
.