నెట్వర్క్, ఆదిలాబాద్, వెలుగు: సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్సూచించారు. బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను గురువారం ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల హైస్కూల్లో నిర్వహించగా కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ తన బోధనల ద్వారా బంజారా జాతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. తండాల నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.
సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. నిర్మల్ డీఈఓ రవీందర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, ఖానాపూర్ ఎంపీడీఓ సునీత, ఎంపీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో బంజారా సమాజ్ నాయక్ డాక్టర్ రాథోడ్ రామారావ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడారు.
సంత్ సేవాలాల్ సూచించిన మార్గంలో నడుస్తూ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలన్నారు. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు. స్థానిక సర్పంచ్ జాదవ్ సునీత, పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్ ముండే, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆడే శీల, పెద్ద సంఖ్యలో బంజారాలు పాల్గొన్నారు.
నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామంలో జరిగిన వేడుకల్లో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు. సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమని, ఆయన బోధనలను ఆచరించాలని సూచించారు. బెజ్జూరు మండలం లంబడిగూడ లోని సేవాలాల్ మహారాజ్ జగదాంబ ఆలయంలో లంబాడీలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు.