
నస్పూర్/భైంసా, వెలుగు: ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన కస్తుర్బా గాంధీ బాలికల స్కూల్ విద్యార్థిని దుర్గం మమతను మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్, డీఈఓ యాదయ్య సన్మానించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో మమతను సన్మానించి మాట్లాడారు. తాండుర్ మండలంలోని కస్తుర్బా గాంధీ బాలికల స్కూల్ లో ఎంపీహెచ్ డబ్ల్యూ సెకండియర్ చదివిన దుర్గం మమత 979 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తూ జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. ప్రత్యేక అధికారులు సుమన చైతన్య, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
నేటి పోటీ ప్రపంచంలో చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పాటిల్ అన్నారు. శుక్రవారం స్థానిక వేదం పాఠశాలలో టెన్త్‌లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించి జ్ఞాపికలు అందజేశారు. చిన్నప్పటి నుంచే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని, సాధన చేస్తే దాన్ని చేరుకోవచ్చన్నారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలన్నారు. ట్రస్ట్‌సభ్యులు సుభాష్ జాదవ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.