వరద నష్టాన్ని అంచనా వేయాలి :కలెక్టర్ బదావత్ సంతోష్

వరద నష్టాన్ని అంచనా వేయాలి :కలెక్టర్ బదావత్ సంతోష్
  • జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలను సమర్పించాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్  ఆదేశించారు.  మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఆస్తి, ప్రాణనష్టం, పంట నష్టం వివరాలను  శాఖల వారీగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  పాఠశాలలు, ఆసుపత్రుల డ్యామేజీ వివరాలను అందజేయాలని ఆదేశించారు.

 జిల్లాలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల వివరాలను తెలపాలన్నారు. ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు నష్టంతో పాటు కల్వర్టులు, బ్రిడ్జిల నష్టాన్ని అంచనా వేయాలన్నారు.  జిల్లాలో ప్రాణనష్టం జరగలేదన్నారు. గత నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ రెండో తేదీ వరకు జిల్లాలో 20.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు.  

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, కలెక్టరేట్ ఏవో సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.