నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రభుత్వం తెచ్చిన మహిళా శక్తి పథకం ఎంతో ఉపయోగం అని, మహిళలంతా ఈ పథాకాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం ఆయన ఎంపీడీఓ, సీడీపీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని తెచ్చిందన్నారు. ఈ పథకంలో మైక్రో ఎంటర్ ప్రైజెస్ విభాగంలో అనుభవం ఉన్న మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేందుకు శిక్షణ ఇస్తామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మహిళా సంఘాలకు ప్రోత్సాహం అందించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ దేవ సహాయం, డీఆర్డేఏ చిన్న ఓబులేసు, ఎల్ డీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వైరల్ ఫీవర్స్పై దృష్టిపెట్టండి..
వైరల్ ఫీవర్స్ రాకుండా ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులను డీఎంహెచ్ఓ తనిఖీ చేయాలని ఆదేశించారు.