నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : మిల్లర్లను ఎన్నిసార్లు హెచ్చరించినా సీఎంఆర్ బియ్యం అప్పజెప్పడం లేదని, మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ లో మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఆర్ బియ్యం చెల్లించని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. క్రిమినల్ చర్యలతోపాటు ప్రాపర్టీని రికవరీ చేస్తామని, ష్యూరిటీలపై కూడా చర్యలుంటాయని తెలిపారు.
వీలైనంత తొందరగా సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని మిల్లర్లను ఆదేశించారు. వానకాలం 2023- 24 కు సంబంధించి, 49,048 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ను ప్రభుత్వానికి చెల్లించగా, ఇంకా 41,458 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని చెల్లించవలసి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ సీతారామరావు, డీఎస్వో స్వామీ కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్ బాలరాజు, జిల్లాలోని మిల్లర్లు పాల్గొన్నారు.
వనపర్తి, వెలుగు : రైస్ మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి శివారులోని రాఘవేంద్ర ఇండస్ట్రీస్, చిట్యాల గోడౌన్, పెద్దమందడి మండలం వీరాయ పల్లిలో ఉన్న మల్లికార్జున ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. మిల్లుల్లో రికార్డులను తనిఖీ చేశారు. రోజుకు మిల్లింగ్ సామర్థ్యం ఎంత? ఎంతమేర ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చిట్యాల గోడౌన్ లో ఎస్.పీ.ఆర్ స్టాక్స్ తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలను పరిశీలించారు. మల్లికార్జున ఇండస్ట్రీస్ 2022--–23 ఖరీఫ్ సీజన్ లో కేవలం 11 ఏసీకే ల ధాన్యం మాత్రమే అప్పగించారని, మిగతా ధాన్యం త్వరగా అప్పగించాలన్నారు. లేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో పౌర సరఫరాల కార్పొరేషన్ మేనేజర్ షేక్ ఇర్ఫాన్, డీటీ నంద కిశోర్, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.