- మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోశ్
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్బదావత్ సంతోశ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మందమర్రి మండలంలోని సారంగపల్లి, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఐకేపీ అధికారులు తమ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే అకాల వర్షానికి తడిసిపోయినట్టు ఈ సందర్భంగా చంద్రవెల్లి రైతులు వాపోయారు. దీంతో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 136, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 89, మెప్మా కింద 10, డీసీఎంఎస్ ద్వారా 51 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధన మేరకు రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ట్యాగింగ్ చేసి రైస్‌మిల్లులకు కేటాయించిన మేరకు తరలించాలన్నారు.