పోలియో రహితంగా తీర్చిదిద్దుదాం : కలెక్టర్ బదావత్ ​సంతోష్

  •     విజయవంతంగా పల్స్​ పోలియో కార్యక్రమం

నెట్​వర్క్, ఆదిలాబాద్, వెలుగు : పల్స్​ పోలియో కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ ​జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో ఉన్న మాతాశిశు ఆస్పత్రిలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సుబ్బారాయుడు, ఆర్ఎంఓ భీష్మతో కలిసి కలెక్టర్ బదావత్ ​సంతోష్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాలను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామన్నారు.

జిల్లాలో ఐదేండ్లలోపు  పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నామని, ఆదివారమే జన్మించిన 6 మంది పిల్లలకు కూడా వేసినట్లు చెప్పారు. పోలియో చుక్కలు అందనివారికి 4, 5 తేదీల్లో ఇంటింటికి తిరుగుతూ వేస్తామని తెలిపారు. జైనూర్​లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పల్స్​ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెడికల్ సిబ్బంది, అంగవాడీ, ఆశ వర్కర్లు గ్రామాల్లో క్యాంపు ఏర్పాటు చేసి చుక్కలు పంపిణీ చేశారు. డీఎంహెచ్​ఓ తుకారాం, డిప్యూటీ డీఎంహెచ్​ఓ సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

భైంసా ఏరియా హాస్పిటల్​లో పొలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్  ప్రారంభించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా గ్రామాలు, వార్డుల్లో తిరుగుతూ ఐదేండ్లలోపు చిన్నారులందరికీ చుక్కలు వేయాలన్నారు. డిప్యూటీ డీఎంఅండ్​హెచ్ఓ ఇద్రీజ్​ ఘోరి, ఎంపీపీ రజాక్, సూపరింటెండెంట్​డా. కాశీనాథ్, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు. వైద్యాధికారులు డా.అనిత, డా.నీరజ తదితరులు పాల్గొన్నారు. కుంటాల మండల వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు స్థానిక పీహెచ్​సీ డాక్టర్​ శృతి రెడ్డి తెలిపారు. నేరడిగొండ మండల కేంద్రంలో ఎంపీపీ రాథోడ్ సజన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.