కల్వకుర్తి, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో తాగునీరు, వర్షపు నీటి నిలువ, మరుగుదొడ్లు, అండర్ డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి కావాల్సిన నిధుల గురించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ద్వారా ఎస్టిమేషన్ తయారు చేయించి పంపాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ప్రశ్నించారు. పాఠశాలలో స్టాక్ రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వెల్దండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వైద్య సేవలపై ఆరా తీశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఏ మందులు కొరత ఉన్నాయో ముందుగానే తెలపాలని, రాష్ట్రస్థాయిలో మాట్లాడి మందులను తెప్పిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట వెల్దండ తహసీల్దార్ కార్తీక్ కుమార్ తదితరులు ఉన్నారు.