నాగర్ కర్నూల్ టౌన్/కోడేరు, వెలుగు : ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. బుధవారం నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముదునూరు, పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్, తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి పథకం శ్రీనిధి బ్యాంకు లింకేజీ రుణాలతో ఏర్పాటు చేసిన యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా జిల్లాలో పెరటి కోళ్ల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలని
గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే పనులను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 12 రకాల యూనిట్ల ఏర్పాటుకు మహిళలకు అవసరమైన సహకారం అందిస్తున్నామని, మహిళా సంఘాలు మీసేవా, ఆహార శుద్ధి కేంద్రాలు, పౌల్ట్రీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనిధి అడిషనల్ పీడీ లక్ష్మీనారాయణ, డీపీఎం అరుణాదేవి, శ్రీనిధి అధికారులు పాల్గొన్నారు.
రూ.435.06 కోట్ల రుణాలు..
జిల్లాలో 2,958 సహాయక సంఘాల సభ్యులకు యూనిట్స్ గ్రౌండింగ్ అయ్యాయని, రూ 238.46 కోట్ల రుణాలు అందించామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకం అమలుపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి యూనిట్ల రుణ లక్ష్యం రూ.435.06 కోట్లుగా నిర్దేశించినట్లు తెలిపారు.
యూనిట్ల ఏర్పాటుపై మహిళా సంఘాల బాధ్యులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నెలా టార్గెట్ నిర్ణయించి ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. డీఆర్డీవో చిన్న ఓబులేషు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, శ్రీనిధి అడిషనల్ పీడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు..